మొదలు పెట్టిన షమీ..
భారత బౌలింగ్ ఎటాక్‌ను ప్రారంభించిన షమీ.. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ప్రమాదకర ఫిన్ అలెన్ (0) డకౌట్ చేశాడు. షమీ వేసిన బంతిని సరిగి అంచనా వేయలేకపోయిన అలెన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే మరో వికెట్ పడకుండా డెవాన్ కాన్వే (7), హెన్రీ నికోల్స్ (2) ప్రయత్నించారు. అయితే సిరాజ్ బౌలింగ్‌లో నికోల్స్ అవుటయ్యాడు.
19 బంతులు ఎదుర్కొన్న తర్వాత కూడా కేవలం 2 పరుగులే చేసిన అతను ఒత్తిడికి గురయ్యాడు. దీంతో బ్యాటు ఝుళిపించే ప్రయత్నం చేయగా.. గిల్ క్యాచ్ పట్టేశాడు. అతను అవుటయ్యే సమయానికి కివీస్ స్కోరు కేవలం 8 పరుగులే కావడం గమనార్హం.
వికెట్లు పంచుకున్న బౌలర్లు..
మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన షమీ బౌలింగ్‌లో డారియల్ మిచెల్ (1) కూడా అవుటయ్యాడు. స్ట్రైట్ షాట్ ఆడేందుకు అతను ప్రయత్నించగా.. చాలా వేగంగా రియాక్ట్ అయిన షమీ తన పక్క నుంచి గాల్లో వెళ్తున్న బంతిని చటుక్కున పట్టేశాడు. దీంతో మిచెల్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత తన తొలి ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా కూడా సత్తా చాటాడు. డెవాన్ కాన్వే కొట్టిన స్ట్రైట్ డెలివరీని ఎడం చేత్తో పట్టేసి అవుట్ చేశాడు. ఆ ఓవర్లో అతను ఒక్క పరుగు కూడా ఇవ్వకపోవడం గమనార్హం.
సగం మంది బ్యాటర్లు అవుట్
ఇలా టపటపా వికెట్లు పోవడంతో న్యూజిల్యాండ్ జట్టు పది ఓవర్ల తర్వాత 15 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే అప్పటికి కెప్టెన్ లాథమ్ (17 బంతుల్లో ఒక్క పరుగు) క్రీజులో ఉండటంతో అతను ఇన్నింగ్స్ చక్కదిద్దుతాడని అనుకున్నారు. కానీ శార్దూల్ ఠాకూర్ వచ్చి అతన్ని కూడా అవుట్ చేశాడు. ఆఫ్‌స్టంప్ ఆవలగా ఠాకూర్ వేసిన బంతిని ఆడేందుకు ప్రయత్నించిన లాథమ్.. స్లిప్స్‌లో ఉన్న గిల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 15 పరుగులకే ఆ జట్టు సగం మంది బ్యాటర్లను కోల్పోయింది.