మిడిలార్డర్‌లో ఇషాన్..
హోమ్ గ్రౌండ్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న మహమ్మద్ సిరాజ్ రాణించాలని కోరుకుంటున్నట్లు రోహిత్ శర్మ తెలిపాడు. ‘న్యూజిలాండ్ వంటి బలమైన జట్టుతో వన్డే సిరీస్ ఆడుతున్నాం. మా శక్తి సామర్థ్యాలను పరీక్షించుకోవడానికి ఇది మంచి అవకాశం. గత సిరీస్‌లో (శ్రీలంక) తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఇషాన్ కిషన్‌కు ఈ సారి మిడిల్ ఆర్డర్‌లో అవకాశం కల్పిస్తాం. వన్డే వరల్డ్‌కప్ వరకు బలమైన జట్టును తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.
సిరాజ్‌కు ఆల్‌ది బెస్ట్..
మహ్మద్ సిరాజ్‌కు ఉప్పల్ స్టేడియం హోంగ్రౌండ్. తొలిసారి హోమ్‌గ్రౌండ్‌లో వన్డే మ్యాచ్ ఆడుతున్న సిరాజ్‌కు ఆల్‌ది బెస్ట్. గత రెండేళ్లుగా సూపర్ ప్రదర్శన కనబరుస్తున్న సిరాజ్ గ్రాఫ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కొత్త బంతితో వికెట్లు తీస్తూ టీమిండియాకు బూస్టప్ ఇస్తున్నాడు. ఇది మాకు మంచి పరిణామం. ప్రస్తుతం సిరాజ్ మూడు ఫార్మాట్లలోనూ కీలక ప్లేయర్‌గా ఉన్నాడు. వరల్డ్ కప్ దగ్గరపడుతుండడంతో అతనిపై వర్క్‌లోడ్ కాస్త ఎక్కువగా పెట్టాల్సి వస్తోంది. బుమ్రా గైర్హాజరీలో సిరాజ్ జట్టులో ప్రధాన బౌలర్‌గా సేవలందిస్తున్నాడు. కచ్చితంగా రానున్న వన్డే వరల్డ్‌కప్‌లో అతను కీలకం కానున్నాడు.
ప్రత్యర్థితో పనిలేదు..
ప్రత్యర్థి జట్టు ఎలా ఉందో అని ఎక్కువగా ఆలోచించకుండా మా శక్తి సామర్థ్యాలపై దృష్టిపెడతాం. స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, షెహబాష్ ,కుల్దీప్ యాదవ్‌లు అందుబాటులో ఉన్నారు. మ్యాచ్ సమయానికి ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లు లేదా ఒక స్పిన్నర్, నలుగురు పేసర్లు కాంబినేషన్‌పై ఆలోచిస్తాం. ఇక వన్డే వరల్డ్ కప్ జరగనున్న అక్టోబర్-నవంబర్ నెలలో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే మ్యాచ్ టైమింగ్ అనేది మాచేతుల్లో లేదు.. దానిని బ్రాడ్ కాస్టర్స్ డిసైడ్ చేస్తారు.’అని చెప్పుకొచ్చాడు.